- దిల్ సుఖ్ నగర్ సంతోషి మాత ఆలయంలో ఘటన
- పట్టుకుని పోలీసులకు అప్పగింత
- మతిస్థిమితం లేదన్న పోలీసులు
దిల్ సుఖ్ నగర్, వెలుగు: దిల్ సుఖ్ నగర్ బస్ డిపో వెనుక వైపున ఉన్న సంతోషిమాత ఆలయ గర్భగుడి లోపలికి చొరబడిన ఓ వ్యక్తి విగ్రహంపై కర్రలు వేయడం కలకలానికి దారి తీసింది. గర్భగుడిలో పూజారి, భక్తులు బయట నిలబడి దండం పెట్టుకుంటుండగా ఆకస్మాత్తుగా వచ్చిన వ్యక్తి కర్రలు విగ్రహంపై వేసి వెళ్లిపోబోయాడు. వెంటనే భక్తులు పట్టుకుని చితకబాది చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, భక్తులు, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
దిల్ సుఖ్ నగర్ చౌరస్తా వద్ద నేషనల్హైవేపై బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పారు. వినకపోవడంతో కొందరిని అదుపులోకి తీసుకుని మలక్పేట్పీఎస్కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో భక్తులు ఆందోళన విరమించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఘటనా స్థలానికి వచ్చారు.
ఇంత పెద్ద ఘటన జరిగినా డీసీపీ స్థాయి అధికారి రాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఏడు చోట్ల జరిగినా చర్యలు శూన్యమన్నారు. ఘటనపై నిష్పక్ష పాత విచారణ జరిపించాలని వీహెచ్పీ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి , వీహెచ్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక విచారణలో అతడు మతిస్థిమితం లేని వ్యక్తి తేలిందని, హిందూ సంఘాలు, భక్తుల డిమాండ్మేరకు సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.
